క్రీడలుజాతీయం

ఆ యాడ్స్‌చిరాకు తెప్పిస్తున్నాయి: సానియా

చాలా కాలం తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన పలు టీవీ యాడ్‌లపై భారత టెన్నిస్ స్టార్‌ సానియా మిర్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘సరిహద్దుకి అటు.. ఇటు.. ఇరు ప్రాంతాల్లో చిరాకు తెప్పించే ప్రకటనలు వస్తున్నాయి. సీరియస్‌గా చెబుతున్నాను. ఈ మ్యాచ్‌కు మీరు మరింత ప్రచారం కలిగించాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా చెత్త పనులతో. ఈ మ్యాచ్‌పై అభిమానులకు ఇప్పటికే కావాల్సినంతగా శ్రద్ధ ఉంది. ఇది అనూహ్య క్రికెట్‌ మ్యాచ్‌. ఇంతకన్నా ఎక్కువ అని మీరు భావిస్తుంటే, మీకు స్వీయ నియంత్రణ అవసరం. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి’’ అని ఆమె ట్వీట్ చేశారు.

కాగా, ఈ ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్‌ క్రికెట్ జట్ల మధ్య జూన్‌ 16న మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఛానెల్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓ యాడ్‌ విడుదల చేసింది. భారత్‌ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందంటూ వ్యంగ్యంగా దీన్ని రూపొందించిన విషయం తెలిసిందే. భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి పలు విషయాలను చెబుతున్నట్లు ఓ వీడియోను రూపొందించింది. మరోవైపు, భారత్‌లోనూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో టీమిండియా చేతిలో పాక్ గతంలో ఘోరంగా ఓడిపోయిన తీరును వివరించారు. వీటిపైనే సానియా మిర్జా మండిపడ్డారు.