జాతీయంసినిమా

ఆ నిర్మాత అసౌకర్యానికి గురి చేశారు

ముంబయి: ‘లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా’ సినిమా షూట్‌లో నిర్మాత ప్రకాశ్‌ ఝా తనను అసౌకర్యానికి గురి చేశారని నటి అహనా కుమ్రా ఆరోపించారు. 2016లో వచ్చిన ఈ సినిమాకు అలంకృతా శ్రీవాత్సవ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌ ఝా నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా స్క్రీన్‌ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా సెట్‌లో జరిగిన ఓ సంఘటనను అహనా కుమ్రా తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ‘ఈ సినిమా కోసం శృంగారభరితమైన సన్నివేశాన్ని షూట్‌ చేస్తున్నప్పుడు ప్రకాశ్‌ ఝా సెట్‌కు వచ్చారు. ఆ సీన్‌ కోసం నన్ను ఇబ్బంది పెట్టారు. ఆయన ఆ సీన్‌కు సలహాలు ఇస్తుంటే వినడానికి సౌకర్యంగా అనిపించలేదు. నేను దర్శకురాలు అలంకృత దగ్గరికి వెళ్లాను. ఆయన నా డైరెక్టర్‌ కాదు.. ఆయనకు సెట్‌లో ఏం పని, నా నటన విషయంలో ఆయన ఎందుకు తప్పులు చూపిస్తున్నారు?అని అడిగా. ఆయన కేవలం నిర్మాత మాత్రమే అన్నాను. దీంతో అలంకృత ఆయన్ను బయటికి వెళ్లమన్నారు. మేం సౌకర్యంగా ఫీల్‌ అవడం లేదని ఆయనకు అర్థం అయ్యింది. ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు’ అని అన్నారు.

సినీ కెరీర్‌ ఆరంభంలో చిత్ర పరిశ్రమలో తనకు వేధింపులు ఎదురయ్యాయని గత ఇంటర్వ్యూలో అహనా కుమ్రా అన్నారు. ఓ వ్యక్తి తప్పుగా ప్రవర్తించారని, దాన్ని సహించలేకపోయానని చెప్పారు. ఇలా తనను వేధింపులకు గురి చేసిన వారికి సంబంధించిన ఫోన్‌ నెంబర్లు బ్లాక్‌ చేసి, డిలీట్‌ చేసినట్లు తెలిపారు. వారిలో ప్రముఖ నిర్మాతలు, దర్శకులు కూడా ఉన్నారని అన్నారు.