జాతీయం

ఆ నిర్ణయం వెనక్కు తీసుకోండి.. లేదా..

కోజికోడ్‌ (కేరళ): కేరళలోని ఓ ముస్లిం విద్యాసంస్థల అధిపతికి చంపేస్తామని బెదిరింపు కాల్‌ వచ్చింది. తన విద్యాసంస్థల్లో యువతులు, మహిళలెవరూ ముసుగు ధరించకూడదని ఆయన ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల తాను ఇచ్చిన ఆదేశాన్ని వెనక్కు తీసుకోకపోతే చంపేస్తామంటూ తనకు కాల్‌ వచ్చిందని ముస్లిం ఎడ్యుకేషనల్‌ సొసైటీ (ఎంఈఎస్‌) ప్రెసిడెంట్‌ పీఏ ఫజల్‌ గఫూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కోలికోడ్‌కు చెందిన ఈ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా 150 వరకూ స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి. అయితే విద్యా సంస్థల అధినేతకు వచ్చిన కాల్‌ గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిందని పోలీసులు నిర్ధరించారు.
గత నెల 17న గఫూర్‌ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. ఈ విద్యా సంవత్సరం నుంచి తమ గ్రూపునకు చెందిన కళాశాలలు, పాఠశాలల్లో తలపై ముసుగు ధరించడం నిషిద్ధం. ఇలా తరగతి గదికి రాకూడదని అన్ని పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లకి ఉత్తర్వులు పంపారు. ఈ పరిణామాన్ని కొన్ని ముస్లిం సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ ఉత్తర్వు ఇస్లాంకు విరుద్ధంగా ఉందని, తక్షణం వెనక్కు తీసుకోవాలని సమస్థ అనే సనాతన ఇస్లాం సంస్థ డిమాండ్‌ చేసింది.
మరోవైపు శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా కూడా ముస్లిం మహిళల వేషధారణపై ప్రధానికి కొన్ని సూచనలు చేస్తూ సంపాదకీయం రాసింది. జాతీయ భద్రత దృష్ట్యా మహిళలు బుర్ఖా లేదా ముసుగు ధరించడాన్ని నిషేధించాలని సూచించింది. ఈ విషయంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అడుగుజాడల్లో నడవాలని ప్రధానికి సూచించింది. అయితే శివసేన వైఖరిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ విరుచుకుపడ్డారు. ఈ పత్రిక రాసిన కథనం సమాజంలో చీలికలు తెచ్చేలా ఉందని విమర్శించారు.