తెలంగాణ

ఆ ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించండి: కాంగ్రెస్‌

దరాబాద్‌: తెలంగాణలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.  పార్టీ ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ నేతృత్వంలో కాంగ్రెస్‌ నేతల బృందం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ను  రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు చెప్పిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు  కోరారు. వారిపై అనర్హత వేటు వేసేలా సభాపతికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఏడు పేజీల వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.

ఫిరాయింపులు బ్లడ్‌ క్యాన్సర్‌లాంటివి: మొయిలీ
అంతకుముందు గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మొయిలీ భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయింపులు బ్లడ్‌ క్యాన్సర్‌లాంటిదని వ్యాఖ్యానించిన మొయిలీ.. వీటిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే ఇలాంటి పార్టీ ఫిరాయింపులపై న్యాయపరంగా ఉన్న లోపాలను సవరిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన  ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు కుంతియా డిమాండ్ చేశారు.