Uncategorized

ఆ ఈవీఎంల కోసం 600మంది ఇంజినీర్లు!

హైదరాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్‌ విషయమై పూర్తి స్థాయిలో చర్చించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) డిప్యూటీ కమిషనర్‌ ఉమేశ్‌ సిన్హా తెలిపారు. అభ్యర్థులు భారీగా ఉన్నప్పుడు ఈవీఎం, వీవీప్యాట్‌లు వాడటం ఇదే తొలిసారన్నారు. నిన్న హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర ఎన్నికల బృందం మంగళవారం నిజామాబాద్‌లో ఎన్నికల నిర్వహణ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌, నిజామాబాద్‌, జగిత్యాల కలెక్టర్లు, ఇతర అధికారులు, బెల్, ఈసీఐఎల్ ఇంజనీర్లతో చర్చించింది.  ఈ సందర్భంగా ఉమేశ్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంను తొలిసారి హైదరాబాద్‌లోనే తయారు చేశారని తెలిపారు. ఎక్కువ మంది అభ్యర్థులకు ఈవీఎంలతో పోలింగ్‌ జరపడం కూడా ఇక్కడే చరిత్రగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు గరిష్ఠంగా నాలుగు బ్యాలెట్‌ యూనిట్లను ఉపయోగించామని, తొలిసారిగా నిజామాబాద్‌లో 12 బ్యాలెట్‌ యూనిట్లు వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఒక్క నిజామాబాద్‌ నియోజకవర్గంలోనే 1788 పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుందన్నారు. రేపట్నుంచి నిజామాబాద్‌లో రేపట్నుంచి పోలింగ్‌ పూర్తయ్యే వరకు 600 మంది ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. నిజామాబాద్‌లో ఎన్నికల నిర్వహణకు 25 వేల బ్యాలెట్‌ యూనిట్లు కావాలన్నారు.