క్రైమ్తెలంగాణ

ఆస్తి కోసం చెల్లెలు, బావను నరికిన బామ్మర్ది

మూసాపేట : 3 ఎకరాల భూమి కోసం సొంత చెల్లెలు, బావను కత్తులతో నరికాడు ఓ కసాయి అన్న. ఘటనలో బావ అక్కడికి అక్కడే మృతి చెందగా చెల్లెలు కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఘటన రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వేములలో చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన కృష్ణారెడ్డికి ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వారికి పెళ్లిలు అయ్యాయి. కృష్ణారెడ్డి కొంతకాలం ఆర్మీలో పనిచేసి, ప్రస్తుతం పోలీసు శాఖలో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. వీరికి వంశపారంపర్యంగా సక్రమించిన 3 ఏకరాల భూమిని అందరికి సమానంగా ఇవ్వాలని చెల్లెల్లు అడగగా కృష్ణారెడ్డి అంగీకరించకపోవడంతో ఇద్దరు చెల్లెల్లు తమకు రావల్సిన వాటా కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే కోన్నేళ్లుగా ఆ కేసు కోర్టులో నడుస్తునే ఉంది. మూసాపేట మండలం వేముల గ్రామానికి చెందిన టీ మధుసుదన్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేసిన చెల్లెలు సత్యమ్మ ఎక్కువ శ్రద్ధ చూపుతుందని, ఈ విషయంపై పలుమార్లు అన్నాచెల్లెలి మధ్య చిన్న చిన్న గోడవలు కూడా జరిగాయి.

అయితే చెల్లెలి భర్త మధుసుదన్‌రెడ్డికి చెందిన వ్యవసాయ భూమి అదే మండలంలోని తుంకినీపూర్ గ్రామ సమీపంలో ఉంది. గురువారం వ్యవసాయ పనులు ముగించుకుని చెల్లెలు సత్యమ్మ, ఆమె భర్త చీకటి పడుతున్న సమయంలో ఇంటికి వెళ్తుండగా పథకం ప్రకారం మాటు వేసి ఉన్న కృష్ణారెడ్డి, అతడి భార్య ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ముందుగా మధుసుదన్‌రెడ్డిపై దాడి చేసి అతి కిరాతకంగా నరికారు. అడ్డుకోవడానికి వెళ్లిన సత్తమ్మను కూడా వదలకుండా కత్తులతో విచక్షణ రహితంగా నరికారు. సత్యమ్మ వారికి కొంత దూరంలో వస్తున్న మరో మహిళను కేకలు వేసి మమ్మళ్లి చంపుతున్నారు అని అరవడంతో అమె పెద్దగా అరుస్తూ పరుగులు పెట్టింది.

అమెను కుడా చంపడానికి వెళ్తుండడంతో అమె పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు విషయం చెప్పి అందర్నీ ఘటనా స్థలానికి తీసుకొచ్చే సరికే మధుసుదన్‌రెడ్డి మృతి చెందాడు. సత్యమ్మ కొన ఊపిరితో ఉండడంతో అమెను ఆరా తీయగా తన సొంత అన్నే నరికి నట్లు చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్ధలానికి మహబూబ్‌నగర్ డీస్పీ భాస్కర్, భూత్పూర్ సీఐ పాండురంగారెడ్డి చేరుకుని ఆమెను అంబులెన్స్‌లో జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఎస్‌వీఎస్‌కు తరలించారు. ప్రత్యక్ష సాక్షితో పోలీసులు మాట్లాడి వివరాలను సేకరించారు. మృతదేహాన్ని శవ పరీక్షల కోసం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పాండురంగారెడ్డి తెలిపారు.