క్రీడలు

ఆస్ట్రేలియా ఆటగాడు చెలరేగిపోయాడు..

క్వీన్స్‌ల్యాండ్: ఆస్ట్రేలియా ఆటగాడు డి ఆర్కీ షార్ట్ లిస్ట్-ఎ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా (డబ్ల్యూఏ) తరపున బరిలోకి దిగిన షార్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్వీన్స్‌లాండ్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. బంతివేయడమే పాపమన్నట్టు బౌండరీ దాటించాడు. బౌలర్ ఎవరైనా బంతి మాత్రం సిక్సరే. మొత్తం 148 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ 23 సిక్సర్లు, 15 ఫోర్లతో ఏకంగా 257 పరుగులు చేశాడు. అతడి వీర బాదుడికి డబ్ల్యూఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 387 పరుగులు చేసింది. అనంతరం 388 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన క్వీన్స్‌ల్యాండ్ 271 పరుగులకు ఆలౌట్ అయింది.
ఒక ఇన్నింగ్స్‌లో ఒక బ్యాట్స్‌మన్ 23 సిక్సర్లు కొట్టడం వన్డే క్రికెట్‌లో చరిత్రలో ఇదే తొలిసారి. గతంలో కివీస్ ఆటగాడు కోలిన్ మున్రో దేశవాళీ క్రికెట్‌ ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లో 23 సిక్సర్లు కొట్టాడు. కాగా, అంతర్జాతీయ వన్డేల్లో 200 పైగా పరుగులు చేసిన వారి జాబితాలో సర్రే ఆటగాడు అలీ బ్రౌన్ (268), భారత ఆటగాడు రోహిత్ శర్మ (264) ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా తరపున డబుల్ సెంచరీ సాధించిన వారిలో బెన్ డంక్, ఫిలిప్ హ్యూస్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. ఇప్పుడు షార్ట్ ఆ జాబితాలో చేరాడు.