సినిమా

ఆసుపత్రిలో చేరిన విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌‌: యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు పని ఒత్తిడి ఎక్కువైందట. విరామం లేకుండా షూట్‌లో పాల్గొనడంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభించింది. మే 31న సినిమాను తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా పని ఒత్తిడి ఎక్కువై విజయ్‌ గురువారం అనారోగ్యం పాలయ్యారట. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు విజయ్‌ ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు. భయపడాల్సిందేమీ లేదని పేర్కొన్నారు. ‘హోలీని చాలా గొప్పగా జరుపుకొన్నా. బుధవారం తెల్లవారుజామున ఆరు గంటల వరకూ నేను షూటింగ్‌లోనే ఉన్నా. దీంతో నాకు జర్వం వచ్చిందని అర్థమైంది.కానీ తొందరగా కోలుకోవాలి. అందుకే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా’ అని ఆయన పేర్కొన్నారు. విజయ్‌కు విశ్రాంతి కావాలని, కానీ షూటింగ్‌ ఆపడం ఆయనకు ఇష్టంలేదని.. ఈ కారణం వల్లే వీలైనంత త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో ఆసుపత్రికి వెళ్లారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి