సినిమా

‘ఆర్‌ ఆర్‌ ఆర్’.. మరిన్ని టైటిల్స్‌ పంపండి!..

హైదరాబాద్‌: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. తాను తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ (వర్కింగ్‌ టైటిల్‌)కు పూర్తి పేరును పెట్టే అవకాశం అభిమానులకే ఇస్తున్నట్లు గతంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. దాంతో అభిమానుల నుంచి విభిన్నమైన టైటిల్స్‌ వస్తున్నాయని తాజాగా చిత్రబృందం వెల్లడించింది. ‘మా దర్శకుడు రాజమౌళి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ పదాలకు నాలుగు భాషల్లో సరైన టైటిల్స్‌ పెట్టే అవకాశం మీకే ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే మా దృష్టికి ఎన్నో మంచి టైటిల్స్‌ వచ్చాయి. స్టోరీలైన్‌కు తగ్గట్టు మీరు అనుకున్న మంచి టైటిల్‌ను మాకు మరిన్ని పంపిస్తే వాటిలో మంచి టైటిల్‌ను ఎంపికచేసి సినిమాలో వాడతాం. #RRRTITLE పేరుతో టైటిల్స్‌ను పంపించండి’ అని పేర్కొన్నారు. దాంతో అభిమానుల నుంచి మరిన్ని ఆసక్తికరమైన టైటిల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ‘రామ రాజుల రణం’, ‘రణ రంగ రారాజులు’, ‘రఘుపతి రాఘవ రాజారాం’, రౌద్ర రణరంగం’, ‘రామ రాజుల రాజసం’ ఇలా ఎన్నో టైటిల్స్‌ను నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, తారక్‌ కొమురం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియా భట్‌, ఎన్టీఆర్‌కు జోడీగా డైసీ ఎడ్గార్‌జోన్స్‌ నటించనున్నారు. 2020 జులై 30న సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.