తెలంగాణ

ఆరోగ్యానికి రెడ్‌ సిగ్నల్‌

పైన ఎండ మండిపోతోంది. కింద రోడ్డు కాలిపోతోంది. అదేపనిగా వీస్తున్న వడగాలి ఒళ్లంతా దహించి వేస్తోంది. అయినా కాలు కదపకూడదు. కన్ను మలపకూడదు. అర నిమిషం ఎర్ర సిగ్నల్‌ పడితేనే ఎండలో రోడ్డుమీద వేడి తట్టుకోలేక అల్లాడిపోతాం.. కానీ వారు గంటలపాటు అలా నిలబడాల్సిందే. ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించాల్సిందే. రికార్డులు సృష్టిస్తున్న ఎండలకు జనమంతా ఠారెత్తిపోతుంటే ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం జనజీవన స్రవంతి సాఫీగా సాగిపోయేలా.. రాజీ పడకుండా విధులను నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్‌: మామూలు రోజుల్లో పరిస్థితి ఎలా ఉన్నా వేసవికాలం ట్రాఫిక్‌ విధులు నిర్వర్తించడం నిజంగా సవాలే.. గత కొద్దిరోజులుగా విపరీతంగా పెరిగిపోతున్న ఎండల దెబ్బకి జనం కాలు బయట పెట్టేందుకే జంకుతున్నారు. ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లేందుకే ఆపసోపాలు పడుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం గంటల తరబడి నడిరోడ్డుపై నిలబడి ఉంటున్నారు. అసాంఘిక శక్తులతో పోరాడాల్సిన పోలీసులు.. వేసవి వచ్చిందంటే ఎండలతోనూ తలపడాల్సి వస్తోంది. 40 డిగ్రీలు దాటుతున్న ఎండ దెబ్బకి చర్మం చుర్రుమంటోంది. దీనికి వడగాలులు కూడా తోడవడంతో వాతావరణమంతా వేడెక్కుతోంది. మామూలు ఉష్ణోగ్రత కంటే రోడ్డుమీద 1.5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతారు. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉష్ణోగ్రత 44 డిగ్రీలు ఉంటే ఏదైనా రోడ్డుమీద దీన్ని లెక్కించినప్పుడు 45.5 డిగ్రీలు ఉంటుంది. ఎండకు వేడెక్కిన రోడ్డునుంచి వెలువడే అదనపు వేడే ఇందుకు కారణం. ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య గంటల తరబడి నిలబడే ఉండటంతో ట్రాఫిక్‌ సిబ్బంది ఆరోగ్యంపై వేసవి తీవ్ర ప్రభావం చూపుతోంది.