తెలంగాణ

ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. హత్య

అల్వాల్‌: ఇంటిముందు ఆడుకుంటూ ఉన్న ఆరేళ్ల పాపను అపహరించి అతి దారుణంగా హతమార్చాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తుర్కపల్లిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చంద్రయ్య, కృష్ణవేణి దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం మెదక్‌ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చి తుర్కపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గురువారం మధ్యాహ్నం వాళ్ల ఆరేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి 12 గంటల సమయంలో బాలిక మృతదేహాన్ని అటు వైపుగా వెళ్తున్న స్థానికులు కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బాలిక శవాన్ని పరిశీలించారు. అది చిన్నారి మృతదేహమేనని నిర్ధారించుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది. బాధితురాలి ఇంటి పక్కన ఉండే బిహార్‌కు చెందిన ఆరుగురు యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.