జాతీయం

ఆడ్వాణీలా నేను వెళ్లిపోను: దేవెగౌడ

బెంగళూరు: భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీలా తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోనని జేడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. రాహుల్‌ ప్రధాని కావడానికి తాను అండగా నిలుస్తానని తెలిపారు. రాజకీయాల నుంచి తప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. తాను ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోనని మూడు సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటకు, ప్రస్తుత పరిస్థితులకు వివరణ ఇచ్చారు.

‘గతంలో నేను పోటీ చేయను అని చెప్పాను. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. పోటీ చేయక తప్పడం లేదు. అందరి అభీష్టం మేరకు బరిలోకి దిగాను. దీనిలో దాయడానికి ఏమీ లేదు. పదవులు అనుభవించాలనే ఆశ, ప్రధాని కావాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. ఆడ్వాణీలా నేను రాజకీయాల నుంచి తప్పుకోను. పార్టీని కాపాడుకోవడం, ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం. నాది చిన్న పార్టీయే అయినా అప్పుడు నేను ప్రధాని కావడానికి సోనియా గాంధీ సహకరించారు. ఇప్పుడు రాహుల్‌ను ప్రధాని చేయడం నా బాధ్యత’ అని దేవెగౌడ అన్నారు.

ఈసారి ఆయన తుముకూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు కూడా కలిసే పోటీ చేస్తున్నాయి. ఏ స్థానాల్లో ఏ పార్టీకి పట్టుందో బేరీజు వేసుకుని ఈ రెండు పార్టీలు రంగంలోకి దిగాయి.