ఆంధ్రప్రదేశ్

ఆటోడ్రైవర్‌ అత్యుత్సాహం

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం బైరెడ్డిపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వైకాపా గెలవబోతుందన్న ఆనందంలో  ఓ ఆటోవాలా చూపిన అత్యుత్సాహం నాలుగేళ్ల బాలుడిని బలితీసుకుంది. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొంత సేపటికే వైకాపా ఆధిక్యం కనబరచడంతో బైరెడ్డిపేటకు చెందిన కలిశెట్టి హరినాయుడు ఆనందం పట్టలేకపోయాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న హరినాయుడు పది మంది చిన్నారులను ఆటోలో ఎక్కించుకుని ఊరంతా తిరుగుతూ హడావుడి చేశాడు. అతని పరిస్థితి బాగోలేదని గుర్తించిన ఓ మహిళ ఏడుగురు చిన్నారులను దించేశారు. ఈ క్రమంలో హ్యాండిల్‌ను వదిలి నడపడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న కలిశెట్టి చిన్ని(4) అనే బాలుడు దాని కింద పడి నలిగిపోగా మరోఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. చిన్నిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.