ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర రాజకీయాల్లో మీ జోక్యమేంటి?

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి, దోపిడీలను అరికట్టడంతోపాటు రాజకీయ ప్రక్షాళనను భీమవరం నుంచే ప్రారంభిస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానానికి జనసేన అభ్యర్థిగా ఆయన శుక్రవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం భీమవరం పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘‘ తెరాస వాళ్లు ఆంధ్రా ప్రజలను ద్రోహులని తిట్టారు, రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఫ్యాక్షనిస్టులను రాళ్లతో తరిమికొట్టారు. కేటీఆర్‌ ఆంధ్రావాళ్లను పెద్దపెద్ద తిట్లు తిడుతుంటే మీకు పౌరుషం రాలేదా? గోదావరి రక్తం మీలో ప్రవహించడం లేదా? అటువంటి వారిని ఇక్కడకు ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉంది.  ఇదే విషయంపై తాను పోరాటం చేస్తే దాడికి యత్నించారు. అయినా నేను వెనకాడలేదు. ధైర్యమే నా నైజం. తెలంగాణలో ఆంధ్రులు ప్రచారం చేస్తే అంగీకరించని తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఏమిటి?  తెరాస సత్తాచాటాలనుకుంటే మీ పార్టీ అభ్యర్థులను ఇక్కడ నిలిపి ప్రచారం చేయండి’’ అని పవన్‌ సూచించారు. గత ఎన్నికల్లో పవన్‌ ఎక్కడున్నారంటూ వెతికిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో పాల్గొనడం మంచిది కాదని హితవు పలికారు.

ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు
విశాఖలో బలమైన అభ్యర్థులను ఎంపికచేయగానే ప్రత్యర్థి పార్టీల గుండెల్లో భయం మొదలైందని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇంట్లో హత్య జరిగితే గుర్తించలేని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు.‘కిరాతకంగా చంపేశారు, వేలిముద్రలు దొరకలేదు, రక్తపు మరకలు లేవు, కొన్ని గంటల తర్వాత లెటరు దొరికింది..ఇలా చెబుతున్నారు.. పినతండ్రి బాధ్యత మీది కాదా..మీ ఇంట్లో జరిగే హత్యకే ఏం మాట్లాడకపోతే భీమవరంలో అలాంటి సంఘటనలు జరిగితే మీరేం అడ్డుకుంటారు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే ఏం న్యాయం చేస్తారు?’ అని ప్రశ్నించారు.  మీ పార్టీ కిరాయి మూకలను  ఆంధ్రప్రాంతానికి పంపితే తన్ని తరిమేస్తానని,  మినీ ఇండియా లాంటి భీమవరంలో విజయం సాధించి అభివృద్ధితో విశ్వవ్యాప్తం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తను పోటీలో ఉన్న విషయం మరిచిపోయి వైకాపా అభ్యర్థి నిత్యం తెరాస నాయకులతో బిజీగా ఉంటున్నారని, బ్యాంకుల్లో నగదు దాచుకుని కుటుంబ అవసరాలకు, పిల్లల వివాహ, చదువులకు ఉపయోగించుకుందామనుకుంటే అతని మనుషులు అర్బన్‌ బ్యాంకును దివాళా తీయించారని విమర్శించారు. పదివేల కుటుంబాల ఉసురు మూటగట్టుకున్నారని, అటువంటి వ్యక్తి తక్షణం ఎన్నికల నుంచి విరమించుకోవాలని  సూచించారు.

2019 ఎన్నికల్లో రాజకీయ వ్యవస్థ మారకపోతే చాలా కష్టమని పవన్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ఉన్నట్లే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు కూడా త్వరలోనే రిటైర్మెంట్‌ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు. భీమవరం అభ్యర్థిగా తన గెలుపు తధ్యమన్నారు. భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు అయిదేళ్లలో చేయలేనిది, మరో అయిదేళ్లు ఇచ్చినా చేయలేనిది,  తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆరు నెలల్లో పూర్తి చేస్తానని చెప్పారు.

అల్లూరి విగ్రహానికి రూ. కోటి విరాళం ప్రకటన
‘మన్యం ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి అవిరళ కృషి చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు. అటువంటి మహనీయుని 100 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి అవినీతి పరులకు భయం కల్గించాలి. దీని కోసం రూ. కోటి విరాళాన్ని జనసేన పార్టీ నుంచి అందజేస్తున్నా’అంటూ ప్రకటించారు.

నామపత్రం దాఖలు
విజయవాడ నుంచి హెలికాఫ్టర్‌లో శుక్రవారం ఉదయం భీమవరం శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కళాశాలకు చేరుకున్న పవన్‌ అక్కడ్నుంచి నేరుగా కాళ్ల మండలం పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌హాలుకు చేరుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.పలుపార్టీలకు చెందిన నాయకులను జనసేనలోకి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం భారీ ప్రదర్శనతో జువ్వలపాలెంరోడ్డు మీదుగా తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని నామపత్రం దాఖలు చేశారు. నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి నాగబాబుతోపాటు పలు నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న పార్టీ అభ్యర్థులు, మిత్రపక్షాల అభ్యర్థులనూ గెలిపించాలని కోరారు.

మోదీ అంటే మన ఎంపీలకు భయం
ఏలూరు: ‘‘ప్రధాని మోదీ అంటే మన పార్లమెంటు సభ్యులకు భయం. పార్లమెంటులో సమస్యల గురించి అడుగుతారని.. మోదీ వెనక్కి చూస్తే వైకాపా ఎంపీలు బల్లల చాటున కిందకు కూర్చుండిపోతారు. తెదేపా ఎంపీలు ముఖం కనబడకుండా దాచుకుంటారు’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. దమ్ము, ధైర్యం, తెగింపు ఉండి సాహసం చేయగలిగిన నాయకులను జనసేన తరపున బరిలోకి దింపానని ఆయన చెప్పారు. ఓట్లు వేయించుకుని పార్లమెంటు హాల్లో పడుకునే వారిని కాకుండా పోరాటం చేసేవారిని రంగంలోకి దించామని కూడా చెప్పారు. శుక్రవారం ఏలూరు, నిడమర్రు బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో యువతనే నిలబెడతామని, యువ ఆడపడుచులకే అవకాశం ఇస్తామని.. ఇలా సరికొత్త రాజకీయం తెస్తామని ఉద్ఘాటించారు. ‘‘ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనుకుంటున్నారా? ఇదేమైనా గూండా రాజ్యమనుకుంటున్నారా? కిరాయి రౌడీలతో దాడులు చేస్తారా? ఈ స్థాయిలో దౌర్జన్యాలు జరిగితే సామాన్యుడు ఎలా బతకగలుగుతాడు? ఇన్ని జరుగుతున్నా పట్టించుకోలేందంటే మీరూ.. జగన్‌ ఒకటే’’ అని సీఎంనుద్దేశించి వ్యాఖ్యానించారు.‘‘జగన్‌నూ, నన్నూ ఒకేగాటన కడతారా? అని సీఎం అడుగుతున్నారని,  జగన్‌ చేసే అక్రమాలు మీ ఎమ్మెల్యేలూ చేస్తున్నారని చెప్పారు. దళితులపై దుర్భాషలాడతారు. ఆడపడుచులపై దాడులు చేస్తారు. దౌర్జన్యాలకు దిగుతారు. ఇవన్నీ చేసే చింతమనేనికి మీరెందుకు టిక్కెట్టు ఇచ్చారు.’’ అని ప్రశ్నించారు. ఈ రౌడీ ఎమ్మెల్యేలకు జాతీయజెండా పట్టుకునే అర్హత ఉందా అని ఆయన ప్రశ్నించారు.

యువతకు చదువుతోపాటు నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తామని, రాష్ట్రంలో భర్తీ చేయకుండా ఉండిపోయిన మూడు లక్షల ఉద్యోగాలను ఆరునెలల్లో నింపుతామని, శాంతిభద్రతలకోసం 25వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏదైనా పనులు చేయాలంటే నిధులు కొరత అంటున్నారని.. లక్షలకోట్లు పక్కదోవ పడితే ఇంకెక్కడ మిగిలి ఉంటాయని ఆయన ప్రశ్నించారు.