జాతీయం

అలాగైతే పాక్‌కు సాయం చేస్తాం: రాజ్‌నాథ్‌

న్యూదిల్లీ: పాకిస్థాన్‌ తమ భూభాగం నుంచి ఉగ్రవాదులను ఏరివేయడంలో నిబద్ధత చూపితే ఇందుకోసం భారత్‌ కూడా ఆ దేశానికి సాయం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. భారత్‌లో మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వం ఏర్పాటయితే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే అవకాశం ఉంటుందని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన మోదీ స్నేహితుడంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై రాజ్‌నాథ్‌ స్పందిస్తూ… ‘తమ దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని పాకిస్థాన్‌ ప్రకటించాలి. అవసరమైతే భారత్‌ కూడా సాయం చేస్తుంది. ఇటువంటి ప్రకటన పాక్‌ నుంచి వస్తే ఇమ్రాన్‌ ఖాన్ నిజంగానే మోదీ అభిమాని అని‌ మేము నమ్ముతాము. అలాగే, భారత్‌తో పాక్‌ సత్సంబంధాలు కోరుకుంటోందని భావిస్తాము’ అని వ్యాఖ్యానించారు.

‘పాక్‌ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చేస్తామని 2004లో జనరల్‌ ముషారఫ్‌ ప్రకటించారు. ఆ తదుపరి ఏడాదే యూపీఏ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. భారత్‌లాగే పాకిస్థాన్‌ కూడా ఉగ్రవాద బాధిత దేశమని పేర్కొంది. ఇది చాలా పెద్ద తప్పు’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. 2014లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో మోదీ… అప్పటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ను ఆహ్వానించడంపై రాజ్‌నాథ్‌ స్పందిస్తూ… ‘మేము ఓ ప్రయోగం చేద్దామనుకున్నాము. కానీ, మేము అనుకున్న విధంగా జరగలేదు’ అని సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలిస్తే ప్రమాణ స్వీకారోత్సవానికి మరోసారి పాక్‌ ప్రధానిని ఆహ్వానిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘ఎవరిని పిలుస్తాం?.. ఎవరిని దూరంగా ఉంచుతాం? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పడం చాలా తొందరపాటు అవుతుంది’ అని వ్యాఖ్యానించారు.