జాతీయం

అమ్మకు నేనిచ్చే న్యూఇయర్‌ కానుక ఇదే

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తన తల్లి సుశీలా చరక్‌కు న్యూఇయర్‌ కానుక ఇవ్వబోతున్నారట. గురువారం 53వ పుట్టినరోజు జరుపుకొంటున్న సల్మాన్ ముంబయిలోని పాన్వెల్‌ ప్రాంతంలో ఉన్న తన గెస్ట్‌ హౌస్‌లో ఘనంగా పార్టీని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మీడియా వర్గాలతో సమావేశమై విషయాన్ని వెల్లడించారు.

‘‘నాలుగు రోజుల క్రితం అమ్మ నన్ను ఓ విషయం అడిగింది. ‘నీకు ఇప్పుడు ఫోర్‌ ప్యాక్‌ శరీరాకృతి ఉంది. కానీ నాకు 2019 కానుకగా సిక్స్‌ ప్యాక్‌ కావాలి’ అంది. నాకు ఇది చాలా చిన్న విషయం. అమ్మ కోరిక మేరకు నేను కష్టపడుతున్నాను. కఠినమైన వర్కవుట్స్‌ చేస్తున్నాను. ఆహారపు అలవాట్లను మార్చుకున్నాను. ఉదయం, సాయంత్రం జిమ్‌ చేస్తున్నాను. గంట పాటు పరుగు తీస్తున్నాను. కాబట్టి అమ్మకు నేనిచ్చే న్యూఇయర్‌ కానుక సిక్స్‌ప్యాకే’’ అని సల్మాన్‌ వెల్లడించారు.

బుధవారం రాత్రి నుంచి పాన్వెల్‌ ఫాం హౌస్‌లో బర్త్‌డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకలో సల్మాన్‌ కుటుంబంతో పాటు సుస్మితా సేన్‌, కృతి సనన్‌, కత్రినా కైఫ్‌ తదితరులు హాజరై సందడి చేశారు. పార్టీలో సుస్మిత, సల్మాన్‌ కలిసి డ్యాన్‌ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.