అంతర్జాతీయం

అమేఠీ నుంచి రాహుల్‌ నామినేషన్‌

అమేఠీ: సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ అమేఠీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం తన నామినేషన్‌ సమర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లిన రాహుల్‌.. నామినేషన్‌ దాఖలు చేశారు.

ఈ ఉదయం అమేఠీ చేరుకున్న రాహుల్‌.. నామినేషన్‌కు ముందు రోడ్‌ షో నిర్వహించారు. ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్‌ వాద్రా, మేనల్లుడు రేహాన్‌, మేనకోడలు మిరయా, పలువురు కాంగ్రెస్‌ నేతలు రోడ్‌ షోలో పాల్గొన్నారు. యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మాత్రం రోడ్‌షోలో పాల్గొనకుండా నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.

2004 నుంచి రాహుల్‌ అమేఠీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రాహుల్‌కు పోటీగా భాజపా స్మృతి ఇరానీని బరిలోకి దింపింది. అయితే రాహుల్‌పై స్మృతి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లోనూ రాహుల్‌పై పోటీకి బాజపా మరోసారి స్మృతినే ఎంచుకుంది. అమేఠీ పోరుకు ఎస్పీ-బీఎస్పీ కూటమి దూరంగా ఉండటంతో వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

మరోవైపు రాహుల్‌ అమేఠీతో పాటు కేరళలోని వయనాడ్‌ స్థానం నుంచి కూడా బరిలోకి దిగారు. ఈ నెల 4న వయనాడ్‌ నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలోనూ రాహుల్ వెంట సోదరి ప్రియాంక ఉన్నారు.