జాతీయం

అమెరికాకు తిరిగి వచ్చేయండి

వాషింగ్టన్‌, దుబాయ్‌: అమెరికా-ఇరాన్‌ల మధ్య తలెత్తిన ఘర్షణలు మరింతగా ముదురుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు సైనిక దాడులకు పురిగొల్పే చర్యలకు దారితీస్తున్నాయి. ఇరాన్‌ దాడులకు దిగవచ్చనే అనుమానంతో పొరుగునే ఉన్న ఇరాక్‌లోని దౌత్య కార్యాలయ సిబ్బందిని విదేశాంగ శాఖ వెనక్కి రప్పిస్తోంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ రాయబార కార్యాలయం, ఎర్బిల్‌లోని కాన్సులేట్‌ కార్యాలయంలోని అత్యవసర సేవల్లో ఉండే సిబ్బంది మినహా ఇతర ఉద్యోగులంతా అమెరికాకు తిరిగి రావాలని ఆదేశించింది. ఇరాక్‌లోని దక్షిణ ప్రాంతంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా, వారిపై ఇరాన్‌లోని షియా ముస్లిం మత పెద్దల ప్రభావం అధికంగా ఉంది. పరిస్థితిని గమనించిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో గత వారం ఇరాక్‌ వెళ్లి అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతరులను కలిశారు. దౌత్య సిబ్బందిని కాపాడుకోవడం తమకు ప్రాధాన్య అంశమని చెప్పారు. ఇప్పటికే అమెరికా పర్షియన్‌ గల్ఫ్‌ సముద్రంలో యుద్ధ విమానాల వాహక నౌకను, బాంబుల దళాలను మోహరించింది.సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్‌ ట్యాంకర్లు, పైపులైనుపై యెమెన్‌కు చెందిన హుతి ఉగ్రవాదులు డ్రోన్లతో చేసిన దాడుల కారణంగా ముడిచమురు సరఫరాకు ఆటంకం కలుగుతుందని ఆ దేశ అధికారులు తెలిపారు.
యురేనియంను శుద్ధి చేస్తాం
అణ్వాయుధాల తయారీకి ఉపయోగించేలా యురేనియంను శుద్ధి చేయడం తమకు కష్టమేమీ కాదని ఇరాన్‌ సర్వోన్నత నాయకుడు ఆయుతుల్లా అలీ ఖమెనేయి తెలిపారు.ఎవరూ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అమెరికాతో చర్చలు ఉండబోవని ఆయన అన్నారు.