అంతర్జాతీయం

అమెరికన్ టీవీ యాంకర్‌ నా బాల్యం అత్యాచారానికి గురయ్యా..

ప్రముఖ అమెరికన్ టీవీ యాంకర్‌, మోడల్ పద్మాలక్ష్మి తన బాల్యం నుంచి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఆర్టికల్ గా రాసింది. నాకు పదహారు ఏళ్లు ఉన్నప్పుడే  అత్యాచారానికి గురయ్యా అంటూ సంచలనం రేపింది. ఈ అఘాయిత్యం చేసింది బయటి వారు కాదు. నాకు బాగా తెలిసిన వ్యక్తి.. నేను బాగా నమ్మిన వ్యక్తే ఈ దారుణం చేశాడు. ఇంత వరకూ ఈ విషయాన్ని మా అమ్మతో కూడా చెప్పుకోలేదు.. అంటూ తన చేదు అనుభవాల్ని పంచుకున్నారు. మేం లాస్‌ఏంజెల్స్‌లోని శివారు ప్రాంతంలో నివసించేవాళ్లం. స్కూల్‌ పూర్తయ్యాక అక్కడే ఉన్న మాల్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేసేదాన్ని. అప్పుడు  ఓ 23 ఏళ్ల యువకునితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.  కొద్దినెలల పరిచయం తరువాతే ఆ వ్యక్తి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది జరిగి 32 ఏళ్లు అవుతున్నా గత వారం రోజుల నుంచి ఈ సంఘటన నాకు గుర్తుకు వస్తూనే ఉంది. ఎందుకంటే ఇటీవల ఇద్దరు మహిళలు తమ పట్ల జరిగిన వేధింపుల గురించి బయటపెట్టారు. అందుకే నేనూ నా పట్ల జరిగిన ఈ దారుణాన్ని ఇప్పుడు బయటపెడుతున్నాను.

పురుషుడు తన లైంగిక అవసరాలు తీర్చుకోవడం కోసమే స్త్రీతో బంధాన్ని కోరుకుంటాడా, ఆమె యొక్క ఇష్టాఇష్టాలతో పని లేదా అనిపించింది. నాపై అత్యాచారం జరిగిందన్న విషయం మా అమ్మకు చెప్పుకోలేక పోయాను. అని దానికి గల కారణాలను తెలిపింది. ఒక వేళ ఈ విషయం మా అమ్మతో చెప్తే ఏం జరిగేదో నాకు తెలుసు. నాకు ఏడేళ్లు ఉన్నప్పుడు.. నా సవతి తండ్రికి సంబంధించిన ఓ వ్యక్తి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం అమ్మకు తెలియడంతో నన్ను ఇండియా పంపించారు. ఏడాది పాటు అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను. తాను చేసిన తప్పుకు నేను శిక్ష అనుభవించాను. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్తున్నానంటే.. నేను పడిన బాధ నా కూతురు పడకూడదు. తను ఏ సమస్య గురించైనా ధైర్యంగా నాతో చెప్పుకోవాలి. నేను తనకు తోడుగా ఉన్నాననే నమ్మకం తనకు కల్పించాలి. ప్రతి తల్లి కూడా ఇలానే చేయాలి. అని న్యూయార్క్ టైమ్స్ కు రాసిన ఆర్టికల్ లో పద్మలక్ష్మీ తెలిపింది.