ఆంధ్రప్రదేశ్

‘అనంత’లో పోలింగ్‌ హింసాత్మకం.. ఒకరి మృతి

తాడిపత్రి: అనంతపురంలో పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. జిల్లాలో పలు చోట్ల తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవల్లో ఒక తెదేపా నేత మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. తాడిపత్రి మండలం మీరాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత సిద్దా భాస్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్‌ కేంద్రంలోనే ఈ దాడి జరిగింది. భాస్కర్‌రెడ్డిని అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మృతిచెందారు.

మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ ప్రారంభం అయినప్పటి నుంచీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధ రామాపురంలో పోలింగ్‌ కేంద్రంలోనే తెదేపా, వైకాపా కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అదే మండలం అనప గ్రామంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు.