ఆంధ్రప్రదేశ్

అది జనసేన సీటే అనుకున్నారు..కానీ..!

ఏపీలో ఎన్నికల్లో జనసేన ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సైతం పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.   ఒక్క రాజోలు నియోజకవర్గంతోనే జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఆ పార్టీ కచ్చితంగా  విశాఖ లోక్‌సభ సీటు గెలుస్తుందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఫలితాల్లో ఆ ప్రభావం కనిపించలేదు. అక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఓటమిపాలయ్యారు. తెదేపా అభ్యర్థి మతుకుమిల్లి భరత్‌పై వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ 4,414 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానంలో ఓడిపోవడంతో జనసేన కార్యకర్తలు తీవ్రంగా నిరాశ చెందారు.

కలిసిరాని క్రాస్‌ ఓటింగ్‌

తప్పనిసరిగా గెలుస్తామంటూ అంచనాలు పెంచుకున్న విశాఖ లోక్‌సభ స్థానంలో జనసేన ఓటమికి అనేక కారణాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా క్రాస్‌ ఓటింగ్‌ తమకు కలిసొస్తుందని పవన్‌ పార్టీ భావించినా క్షేత్రస్థాయిలో అలా జరగలేదు. విశాఖ లోక్‌సభ పరిధిలో విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటతో పాటు విశాఖ జిల్లాలోని భీమిలి, విశాఖ నార్త్‌, విశాఖ ఈస్ట్‌, విశాఖ సౌత్‌, విశాఖ వెస్ట్‌, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ స్థానాల్లో ఒక ఓటు వేరే పార్టీకి పడినా ఎంపీ ఓటు కచ్చితంగా జనసేనకే పడుతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేశాయి. అక్కడ లెక్క తప్పింది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ బరిలోకి దిగిన గాజువాక నియోజకవర్గం ఇదే లోక్‌సభ పరిధిలో ఉండటంతో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించారు. కానీ అది పెద్దగా ప్రభావం చూపలేదు.

ఆ రెండు పార్టీలు బలంగా ఉండటంతోనేనా?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు నిజాయతీగల అధికారిగా గుర్తింపు ఉంది. దీంతో విశాఖలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ నగర పరిధిలో అధికంగా ఉన్న యువత, విద్యావంతులు ఆయనకు మద్దతిస్తారని ప్రచారం జరిగింది. అధికారంలో ఉన్నందున తెదేపాతోనే జనసేనకు ప్రధాన పోటీ ఉంటుందని.. కచ్చితంగా జనసేన గెలుస్తుందని పవన్‌ పార్టీ కార్యకర్తలు భావించారు. కానీ అనూహ్యంగా అక్కడ వైకాపా అభ్యర్థి సత్యనారాయణ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచీ తెదేపా-వైకాపా మధ్య ఆధిక్యాలు మారుతూ వచ్చాయి. ఓ దశలో జనసేన గట్టిపోటీ ఇచ్చినా చివరి వరకు అది కొనసాగలేదు. దీంతో తెదేపా-వైకాపా మధ్యే విజయం దోబూచులాడింది. క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు బలంగా ఉండటంతో ఫలితాల్లో జనసేన ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. విశాఖ లోక్‌సభ పరిధిలో వైకాపా అభ్యర్థి సత్యనారాయణకు 4,36,906 ఓట్లు రాగా.. తెదేపా అభ్యర్థి భరత్‌కు 4,32,492, జనసేన అభ్యర్థి లక్ష్మీనారాయణకు 2,88,874 ఓట్లు పోలయ్యాయి.