జాతీయం

అది ఒక ఒంటరి వ్యక్తి గళం: రాహుల్‌

దిల్లీ: భాజపా మేనిఫెస్టోపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. భాజపా హామీ పత్రం అహంకారపూరితంగా ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రం అందుకు భిన్నంగా, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందన్నారు. ‘‘కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విస్తృత చర్చల ద్వారా రూపొందించాం. దాదాపు పది లక్షల మంది భారతీయుల గళమే మా మేనిఫెస్టో. అది తెలివితో రూపొందించిన ఒక శక్తిమంతమైన హామీ పత్రం’’ అని రాహుల్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. అలాగే భాజపా మేనిఫెస్టోపై విమర్శలు కురిపించారు. ‘‘భాజపా మేనిఫెస్టోను ఒక గదిలో రూపొందించారు. అది అహంకారపూరితంగా ఉంది. హ్రస్వ దృష్టితో రూపకల్పన చేసిన ఈ మేనిఫెస్టో కేవలం ఒక ఒంటరి వ్యక్తి గళాన్ని మాత్రమే వినిపిస్తుంది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భాజపా సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘సంకల్ప్ పత్ర’ పేరిట రూపొందించిన ఈ హామీ పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇప్పటికే ప్రకటించిన పీఎం కిసాన్‌ పథకంతో పాటు ఉమ్మడి పౌర స్మృతి అమలు, రామ మందిర నిర్మాణం, కశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు లాంటి పలు కీలక అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.