జాతీయం

అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు గుండు కొట్టించారు

బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు గానూ తల్లీకూతుళ్లకు గుండు కొట్టించారు. అనంతరం వీధుల్లో ఊరేగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…వైశాలి పరిధిలోని గ్రామానికి చెందిన వార్డు కౌన్సిలర్‌ మహ్మద్‌ ఖుర్షిద్‌ మరో కొందరు కలిసి ఆ గ్రామానికి చెందిన ఓ నవ వధువుపై అత్యాచారానికి ప్రయత్నించారు. వీరి దౌర్జన్యాన్ని బాధితురాలు, ఆమె తల్లి అడ్డుకున్నారు. వారిపై తిరగబడ్డారు.

దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన నిందితులు..కాసేపటి తర్వాత మళ్లీ బాధితుల ఇంటికి వచ్చారు. తల్లీకూతుళ్లను కర్రలతో కొడుతూ బయటకి లాగి వారిపై దాడి చేశారు. అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు శిక్షగా అభివర్ణిస్తూ వారికి గుండు కొట్టించారు. అంతటితో ఆగకుండా వారిని నడిరోడ్డుపై ఊరేగించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతుల అక్రమ రవాణాలో ఇప్పటికే ఖుర్షిద్‌ మీద పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు.