జాతీయం

అతడ్ని ఇంప్రెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నా!

బాలీవుడ్‌ నటులు టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ ప్రేమలో ఉన్నారని గత కొన్ని రోజులుగా వదంతులు ఉన్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టు ఇద్దరు అనేక సందర్భాల్లో జంటగా మీడియా కంటపడ్డారు. తమ ప్రేమ గురించి వీరిని ప్రశ్నిస్తే మాత్రం ‘మంచి స్నేహితులం’ అంటుంటారు. తాజాగా ఓ అభిమాని ఇదే ప్రశ్న దిశాను అడిగారు. ‘మీ మధ్య ప్రేమను ఎందుకు ఒప్పుకోరు. మీరు భార్యాభర్తలు కావడం అందరికీ ఇష్టమే’ అని పోస్ట్‌ చేశారు. దీనికి దిశా స్పందించారు. ‘గత కొన్నేళ్లుగా టైగర్‌ను ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడు ‘భారత్’ సినిమాలో నటించా. అందులో చాలా స్టంట్స్‌, డ్యాన్స్‌ చేశా.. అది చూసైనా అతడు ఇంప్రెస్‌ అవుతాడని ఆశించా. కానీ అవలేదు.. నా దురదృష్టం. మేమిద్దరం తినడానికి కలిసి హోటల్‌కు వెళ్తాం. దానర్థం తనకు నేనంటే ఇష్టమని కాదు. ఈసారి అతడితోనే మాట్లాడండి. అతడికీ సిగ్గే, నాకూ సిగ్గే.. చొరవ తీసుకుని చెప్పలేం’ అని అన్నారు.

దిశా ప్రస్తుతం తను కీలక పాత్ర పోషించిన ‘భారత్’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నారు. సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ కథానాయిక పాత్ర పోషించారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. జూన్‌ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది. తెలుగు చిత్రం ‘లోఫర్‌’తో దిశా నటిగా పరిచయం అయ్యారు. తర్వాత ఆమె పలు హిందీ సినిమాల్లో నటించారు.