సినిమా

అతడు నా హృదయంలో నిలిచిపోతాడు:అనుష్క

హైదరాబాద్‌: కొన్నేళ్ల క్రితం మరణించిన తన అసిస్టెంట్‌ రవిని అగ్ర కథానాయిక అనుష్క గుర్తు చేసుకున్నారు. ఆయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అతడితో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. ఆమె మాటల్ని బట్టి ఏడేళ్ల క్రితం రవి మృతి చెందినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన వర్థంతి సందర్భంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

‘నిజంగా మనల్ని ప్రేమించే వారు మనల్ని వదిలి ఎక్కడికీ వెళ్లరు. మరణం అందుకోలేనివి కూడా కొన్ని ఉంటాయి.. గత 14 ఏళ్లు నాది ఓ ప్రయాణం. మీకు బాగా దగ్గరైన వ్యక్తి ఇక మీ జీవితంలో ఉండరని తెలిసినప్పుడు.. వారు మీ జీవితంలోని కొంత భాగాన్ని తీసుకెళ్తారని అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్‌ రవి కన్నుమూసి ఏడేళ్లు అవుతోందంటే ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. మరణం తర్వాత ఏంటి? అనే విషయం నాకు తెలియదు.. కానీ అతడు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాడు’ అని అనుష్క పేర్కొన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయిన అసిస్టెంట్‌ మరణాన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకోవడం పట్ల అనుష్క మంచితనాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేశారు.