జాతీయం

‘అక్కడ భాజపాకు ఆయనే కీలకం’

దిల్లీ: భాజపా లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అడ్వాణీ లాంటి సీనియర్‌ నేతలకు స్థానం దక్కలేదు. మరోవైపు కొత్త వారికి టికెట్లు వరించాయి. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కరికీ సీటు కేటాయించేలా జాగ్రత్త పడ్డారు. కానీ ఈశాన్య భారతంలో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న అసోం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ పేరు మాత్రం జాబితాలో లేదు. ఇప్పుడిప్పుడే ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న భాజపాకు ఇది తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని అందరూ భావించినప్పటికీ..ఈ విషయంలో పార్టీ మాత్రం పూర్తి ధీమాతో ఉంది. పార్టీకీ.. ఈశాన్య రాష్ట్రాలకు మధ్య వారధిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌ఈడీఏ) సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఆయనే సమర్థుడని నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ రాజకీయాల్లోకి తీసుకురావడం కంటే ఆయన్ని ఆ ప్రాంతానికే పరిమితం చేయాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు సీటు కేటాయించనట్లు సమాచారం.

పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం నిర్వహించిన సమావేశంలో హిమంత బిశ్వ శర్మ పోటీపై చర్చించినట్లు అమిత్‌ షా తెలిపారు. హిమంతను ఎన్‌ఈడీఏ కన్వీనర్‌గానే కొనసాగించడానికి పార్టీ నిర్ణయించినట్లు వెల్లడించారు. పార్టీకి.. ఈశాన్య రాష్ట్రాలకు మధ్య వారధిగా ఉంటారని తెలిపారు. అభ్యర్థుల గెలుపునకు హిమంత కృషి చేస్తారన్నారు. ఆ ప్రాంతంలో పార్టీ వ్యవహరాల్ని సమన్వయపరచాలని కోరామన్నారు. ఈ నిర్ణయాన్ని అసోంతో పాటు ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల కార్యకర్తలు, నాయకులు కూడా అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గతకొంత కాలంగా దిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనకుంటున్నానని హిమంత బిశ్వ శర్మ పలు కార్యక్రమాల్లో తన మనోగతాన్ని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసే అభిప్రాయం ఉందని అందరూ భావించినప్పటికీ.. పార్టీ నిర్ణయాన్ని ఆయన ఆహ్వానించారు. తనపై ఉంచిన బాద్యతను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. అసోం అసెంబ్లీ ఎన్నికల ముంగిట 2015లో హిమంత కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి దూకారు. అనంతరం 2016లో అసోంలో భాజపా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓ సమయంలో ఆయనే ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ ఇతర సమీకరణాల దృష్ట్యా ఆయనకు కీలక ఆర్థిక శాఖను అప్పగించారు. త్రిపురలో భాజపా గెలుపునకు తన వ్యూహాలను అందించారు. 25 లోక్‌సభ సీట్లున్న ఈశాన్యంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా హిమంతను కీలక నేతగా పరిగణిస్తోంది. అసోంలో 14లోక్‌సభ స్థానాలుండగా.. మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపురలో రెండేసి స్థానాలున్నాయి. మిజోరం, నాగాలాండ్‌,  సిక్కిం రాష్ట్రాలకు లోక్‌సభలో ఒక్కో సీటు ఉంది. అసోంలో భాజపా 10 స్థానాల్లో పోటీ చేయనుండగా.. మిత్రపక్షాలు అసోం గణ పరిషత్‌ 3 సీట్లలో, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌ ఒకచోట పోటీ చేయనున్నాయి.