తెలంగాణ

అక్కడ ఎగిరేది గులాబీ జేండాయే…..

ఈ సారి జహీరాబాద్ నియోజకవర్గంలో ఎగిరేది గులాబీ జేండాయే అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు మంత్రి హరీష్ రావు నివాసంలో తెరాసలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధి వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, టీడీపీలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉండి తెలంగాణకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు చేసిందేమి లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రానికి ఆనాడు అడ్డం పడ్డ ఈ రెండు పార్టీలు, తెలంగాణ వచ్చాక  అభివృద్ధి నిరోధకాలుగా మారాయన్నారు. తెలంగాణ ప్రయోజనాలను రాష్ట్రంలో కాంగ్రెస్ అడ్డుకుంటే.. వెలుపల నుంచి చంద్రబాబు  ప్రాజెక్టులను అడ్డుకున్నారని విమర్శించారు. ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలు ప్రశ్నించాలన్నారు. మహిళల కంటనీరు తుడిచేలా మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు  ఇవ్వబోతున్నామని హరీశ్‌రావు తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి నిరోధకాలుగా మారిన ఇలాంటి పార్టీలకు తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లేస్తారు, ఈ రెండు పార్టీలు ప్రజలను ఎలా ఓట్లు అడుగుతాయని హరీశ్‌రావు ప్రశ్నించారు. మాహాకూటమి పేరుతో ప్రజల ముందుకు తెలంగాణ అభివృద్ధి నిరోధక పార్టీలు వస్తున్నాయి, ప్రజలు వాటిని తిరస్కరించాలన్నారు. అరవై ఏళ్లలో ఏం చేసినందుకు ఓటు వేయ్యాలో చెప్పాలని నేతలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. అరవై ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలలో కూడా ఊహించని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టారన్నారు. కాళేశ్వరం, సీతారామా, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టుల ద్వారా కోటి ఎకరాలకు నీరందించే భగీరథ ప్రయత్నం జరుగుతోంది.. వీటి ఫలాలు త్వరలోనే ప్రజలు రుచి చూడనున్నారని తెలిపారు. ఇన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏనాడైనా కాంగ్రెస్, టీడీపీలు ఆలోచించాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించానికి, రానున్న కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి సీఎం కేసీఆర్ ను, తెరాస పార్టీని బలపర్చండి అని హరీశ్‌రావు కోరారు. వచ్చె ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ వంటి తెలంగాణ వ్యతిరేక పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఓడించాలన్నారు.