తెలంగాణ

అంబేడ్కర్‌ విధానాలతో తెలంగాణ సాధన: కేటీఆర్‌

హైదరాబాద్‌: డాక్టర్‌ అంబేడ్కర్‌ అందరివాడని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. దార్శనికుడు అన్న పదం ఆయనకు సరైన గౌరవం అని కొనియాడారు. తెరాస భవన్‌లో అంబేడ్కర్‌ 128వ జయంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌, మంత్రులు మహమూద్‌ అలీ, కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల విషయంలో ఆనాడు అంబేడ్కర్‌ ఆలోచన చేయకుంటే తెలంగాణ ఏర్పడేది కాదన్నారు. తెలంగాణ సాధనలో అంబేడ్కర్‌ విధానాలతోనే కేసీఆర్‌ ముందుకెళ్లారని చెప్పారు. పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్‌ విగ్రహం విషయంలో జరిగిన వివాదంపైనా కేటీఆర్‌ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. దళితుల అభివృద్ధి కోసం నిరంతరం కేసీఆర్‌ తపిస్తుంటారని మహమూద్‌ అలీ అన్నారు.