జాతీయం

అంబులెన్సుకు దారిచ్చిన లక్షల మంది భక్తులు

ఒడిశాలో జులై 4న పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ రోజున చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియోను పూరీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్పీ) ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయిన రథయాత్ర కార్యక్రమం మధ్యలో ఓ అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా ఆస్పత్రికి వెళ్లింది. 1,200 మంది వాలంటీర్లు, లక్షల మంది భక్తులు ఆ అంబులెన్సుకు దారి ఇచ్చి సమయస్ఫూర్తిని చాటారు. ఇందుకు సంబంధించిన వీడియో అబ్బుర పరుస్తోంది. మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉందని చాటి చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆ అంబులెన్సు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లడానికి అక్కడున్న వారు మానవహారాన్ని కట్టారు. భక్తులంతా ఆ అంబులెన్సు వెళ్లడానికి ఇచ్చిన సహకారానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇటీవల ఆందోళనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్‌లో కూడా ఇటువంటి ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వేలమంది నిరసనకారులు అంబులెన్సుకు క్షణాల్లో దారి ఇచ్చి, ప్రాణం విలువను చాటిచెప్పారు. తాజాగా పూరీలో చోటు చేసుకున్న ఘటన హాంకాంగ్‌ ఘటనను మించి ఉందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘‘పూరీ రథయాత్ర కోసం 1200 మంది వాలంటీర్లు, 10 స్వచ్ఛంద సంస్థలు గంటల కొద్దీ సాధన చేశారు. దీని ఫలితంగా ఈ మానవ కారిడార్‌ను ఏర్పాట్లు చేయగలిగి, అంబులెన్సు వెళ్లేందుకు దారి ఇవ్వగలిగారు’’ అని పోలీసులు.. పూరీ ఎస్పీ ట్విటర్‌ ఖాతాలో పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.