ఆంధ్రప్రదేశ్

అందుకే దిల్లీ నుంచి నేతల్ని రప్పిస్తున్నారు:జగన్‌

సంతనూతలపాడు: గత ఐదేళ్లలో ప్రజలపై పన్నుల భారం మోపిన సీఎం చంద్రబాబుకు జనాన్ని చూస్తే భయం పట్టుకుందని, అందుకే ఒంటరిగా ప్రచారం చేయలేక దిల్లీ నుంచి నేతల్ని రప్పిస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. సాగు, తాగు నీరు రెండింటికీ ఇబ్బంది నెలకొందని, అందుకే దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఆనాడు గుండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టులు చేపట్టారని గుర్తుచేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఇప్పుడు గండ్లకమ్మ, రామతీర్థం ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రామతీర్థంకు సాగర్‌ నీరు కూడా ఇప్పించుకోలేకపోయారని విమర్శించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వైఎస్సార్‌ హయాంలోనే పూర్తయినా ఆ ప్రాజెక్టు కింద పంట కాల్వలను ఐదేళ్లలో పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. 11 గ్రామాల్లో ఇంకా పునరావాస పనులే జరగలేదని, దీన్ని బట్టే సీఎంకు ప్రకాశం జిల్లాపై ఉన్న అశ్రద్ధ కనబడుతోందని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. కంది పంటకు కనీస మద్దతు ధర రావడంలేదన్నారు.