జాతీయం

అంతిమ సమరం.. ఎవరిదో విజయం

సార్వత్రిక ఎన్నికల తుది సమరానికి సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా  8 రాష్ట్రాల్లో 59 లోక్‌సభ స్థానాలకు ఏడో విడతగా ఆదివారం పోలింగ్‌ జరగనుంది. బిహార్‌లో 8, ఝార్ఖండ్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 8, పంజాబ్‌లో 13, పశ్చిమబెంగాలో 9, చండీగఢ్‌లో 1,  ఉత్తరప్రదేశ్‌లో 13, హిమాచల్‌ ప్రదేశ్‌లో 4 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మనోజ్‌ సిన్హా, కిరణ్‌ ఖేర్‌, హర్‌దీప్‌సింగ్‌పూరీ, ప్రముఖ సినీనటుడు రవికిషన్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రవి శంకర్ ప్రసాద్‌, పవన్‌కుమార్‌ బన్సాల్‌, పంకజ్‌ సంఘ్వి, శతృఘ్న సిన్హా తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పోటీ కీలకమైంది. ఈ నేపథ్యంలో ఏడో విడతగా పోలింగ్‌ జరగబోయే కీలక నియోజకవర్గాలను ఓసారి పరిశీలిస్తే..

వారణాసిలో తిరుగులేని మోదీ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశి నుంచి ప్రధాని మోదీ వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. సుమారు 22 లక్షల జనాభా, 17 లక్షలకుపైగా ఓటర్లున్న వారణాసి నియోజకవర్గం సంప్రదాయంగా భాజపాకి పట్టున్న ప్రాంతం. 2004లో మినహాయించి 1991 నుంచి ఇక్కడ వరసగా భాజపా అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఈ స్థానానికి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే వార్తలు వినిపించాయి. అధిష్ఠానం ఆదేశిస్తే పోటీకి సై అంటూ ప్రియాంక సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన అజయ్‌ రాయ్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. అయితే తాజా పరిస్థితులను బట్టి విజయం మోదీవైపే మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

గోరఖ్‌పూర్‌లో ‘రవి’ కిరణాలేనా?

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ సారి ప్రతిష్ఠాత్మక పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం భాజపాకు కంచుకోట. అయితే గత ఉపఎన్నికలో కాషాయ పార్టీకి షాక్‌ తగిలింది. 1998 నుంచి 2017 వరకు ఈ స్థానానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రాతినిద్యం వహించారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్ఠించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ మద్దతుతో నిషాద్‌ పార్టీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌ నిషాద్‌ ఎంపీగా గెలుపొందారు. అయితే కొద్ది రోజులకే ఆయన భాజపాలో చేరిపోయారు. ఈ సారి గోరఖ్‌పూర్‌ నుంచి భాజపా తరఫున ప్రవీణ్‌ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే అనుకోని విధంగా ఈ స్థానాన్ని రవికిషన్‌కు కేటాయిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఎస్పీ-బీఎస్సీ కూటమి తరఫున సమాజ్‌వాదీపార్టీకి చెందిన రాం భూహల్‌ నిషాద్‌ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి మధుసూధన్‌ త్రిపాఠి బరిలోకి నిలిచారు. ఉప ఎన్నిక ఫలితాలనే పునరావృతం చేయాలని ఎస్పీ- బీఎస్పీ కూటమి ప్రయత్నిస్తోంది. ఎలాగైనా ఈ నియోజవర్గంలో  పూర్వవైభవాన్ని పొందాలని భాజపా భావిస్తోంది. దాదాపు 19.4 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో రవికిషన్‌ వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమృత్‌సర్‌.. అంత సులువేం కాదు!

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. జోరు కొనసాగించాలని అధికార కాంగ్రెస్, ఉనికి నిలుపుకొవాలని భాజపా, ఈ నియోజవర్గంపై పట్టు సాధించాలని ఆప్‌ భావిస్తున్నాయి. ఎవరికి వారుగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏ అభ్యర్థి గెలుస్తారన్న విషయంపై ఎవరూ అంచానాకు రాలేకపోతున్నారు. తమ హయంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలనే కాంగ్రెస్‌ ప్రచార అస్త్రాలుగా మార్చుకుంది. హస్తం పార్టీకి తామే ప్రత్యామ్నాయమనే భావన భాజపా కలిగిస్తోంది. మరోవైపు ఆప్‌ కూడా ఈ స్థానంలో గెలుపొందేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తోంది. ఫలితంగా అమృత్‌సర్‌ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈస్థానం నుంచి పోటీచేసిన భాజపా సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ… కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మరో కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ భాజపా తరఫున ఇక్కడ రంగంలోకి దిగారు. మోదీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న పురీ.. కాంగ్రెస్‌ అభ్యర్థి గురుజీత్‌ ఔజ్‌లాతో తలపడుతున్నారు. ఆప్‌ నుంచి కుల్దీప్‌ సింగ్‌ ధలియావాల్‌ పోటీ చేస్తున్నారు. జైట్లీ లాంటి ప్రముఖనేత ఓడిపోయిన అమృత్‌సర్‌లో హర్‌దీప్‌ గెలుపు నల్లేరు మీద నడకైతే కాదనే వాదన వినిపిస్తోంది. అమృత్‌సర్‌ లోక్ సభ స్థానంలో 14 లక్షలకు పైచిలుకు ఓటర్లున్నారు.

సాహిబ్‌లో స్నేహితులే ప్రత్యర్థులు

బిహార్‌లోని పట్నాసాహిబ్‌లో  ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ నియోజవర్గం సుదీర్ఘ కాలం భాజపాకు కంచుకోటగా ఉంది. ఆ పార్టీపై అసమ్మతితో  సీనియర్‌నేత  శతృఘ్న సిన్హా రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరో వైపు భాజపా తన అభ్యర్థిగా కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను నిలిపింది. వీరిద్దరూ కీలక వ్యక్తులే కావడంతో విజయమెవరిదన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. పైగా వీరిద్దరూ స్నేహితులు. పట్నా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు.  పట్నాసాహిబ్‌లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు దాదాపు 28 శాతం వరకు ఉంటాయి. ఈ ఓట్లు 2014 కంటే ఈసారి మరింత ఎక్కువగా భాజపా ఖాతాలో పడేలా ఉన్నాయి. సిన్హా, రవిశంకర్‌ ప్రసాద్‌లు ఇద్దరూ కాయస్థ వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో కాయస్థులు భారీ సంఖ్యలో ఉన్నారు. యాదవేతర ఓబీసీలు కూడా జేడీయూ ప్రభావంతో భాజపా అభ్యర్థి రవిశంకర్‌ ప్రసాద్‌వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఇక్కడినుంచి ఇంతకుముందు భాజపా అభ్యర్థిగా గెలిచిన శతృఘ్నసిన్హా ఈసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడం విశేషం. ఈ లోక్‌సభ స్థానంలో 19.4లక్షలకు పై చిలుకు ఓటర్లున్నారు.

ఘాజీపూర్‌లో బహుముఖ పోరు

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ లోక్‌సభ స్థానం ఈసారి బహుముఖ పోరుకు సిద్ధమైంది. భాజపా తరఫున కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా బరిలో ఉన్నారు. మరోవైపు ఎస్పీ-బీఎస్పీ కూటమిలో ఈ స్థానాన్ని బీఎస్సీకి కేటాయించారు.ఆ పార్టీ తరఫున అఫ్జల్‌ అన్సారీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి అజిత్‌ ప్రతాప్‌ కుష్వాహా, సీపీఐ నుంచి భాను ప్రకాశ్‌ పాండే పోటీ చేస్తున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం భాజపా, బీఎస్పీ మధ్యననే చెప్పాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి మనోజ్‌ సిన్హాయే విజయం సాధించారు. దాదాపు 18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2014 ఎన్నికల్లో మనోజ్‌సిన్హా విజయం సాధించగా.. అంతకు ముందు 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులు అఫ్జల్‌ అన్సారీ,  రాధా మోహన్‌ సింగ్‌ వరుసగా విజయం సాధించారు. అయితే ఈ సారి అఫ్జల్‌ అన్సారీ బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు.

చండీగఢ్‌లో బన్సల్ vs కిరణ్‌ఖేర్

పంజాబ్‌లోని చండీగఢ్‌ స్థానంపై కాంగ్రెస్‌ భారీ అంచనాలు పెట్టుకుంది. ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ సత్తా చాటగలదన్ననమ్మకం పార్టీలో తీవ్రంగా బలపడింది. ఈ నేపథ్యంలో చండీగఢ్‌ పార్లమెంటు నియోజకవర్గంలోనూ విజయపతాకను ఎగురవేయాలని హస్తం పార్టీ భావిస్తోంది. 2014లో మోదీ హవాతో ఈ స్థానాన్ని భాజపా తన ఖాతాలో వేసుకుంది. తాజా ఎన్నికల్లోనూ అదే ఫలితాన్నిపునరావృతం చేయాలని కాషాయపార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీంతో ఇక్కడ పోటీ రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. చండీగఢ్‌లో భాజపా తరఫున బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ భార్య, సిట్టింగ్‌ ఎంపీ కిరణ్‌ ఖేర్‌ పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ బరిలోకి దిగారు. బన్సల్‌ చండీగఢ్‌ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఆప్‌ నుంచి హర్‌మోహన్‌ ధావన్‌ బరిలో ఉన్నారు. ఆయన భాజపా తిరుగుబాటు నేత కావడం గమనార్హం. 2014లో కిరణ్‌ ఖేర్‌కు మద్దతుగా నిలిచారు. ధావన్‌ నేరుగా బరిలోకి దిగడం వల్ల భాజపా ఓట్లు చీలిపోయి బన్సల్‌కు ప్రయోజనం చేకూరుతుందని అంచనాలున్నాయి. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం 6.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

ఇండోర్‌లో ఢీ అంటే ఢీ

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు వరుస విజయాలు అందించిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 1989 నుంచి 8 సార్లు ఇదే స్థానం నుంచి మహాజన్‌ ఎంపీగా ఎన్నియ్యారు. 75 ఏళ్లు నిండిన భాజపా నాయకులకు టికెట్‌ ఇవ్వకూడదని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఏప్రిల్‌ 16తో సుమిత్రా మహాజన్‌కు 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇండోర్‌ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసేందుకు భాజపా మల్లగుల్లాలు పడింది. అయితే సుమిత్రా మహాజన్‌ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు తానే స్వయంగా ప్రకటించడంతో కథ సుఖాంతమైంది. ఈ స్థానం నుంచి భాజపా తరఫున  శంకర్‌ లాల్వానీ పోటీ చేస్తున్నారు.  పార్టీలో మంచి పేరున్న వ్యక్తి. ఇండోర్ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి పంకజ్‌ సంఘ్వి బరిలోకి ఉన్నారు. హస్తం పార్టీ వారు విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. సుమిత్రామహాజన్ ఈ సారి పోటీ చేయకపోవడంతో  గెలుపుపై కాంగ్రెస్‌ భారీ అంచానాలు పెట్టుకుంది. లక్షకు పైచిలుకు ఓట్లతో విజయం సాధిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ భాజపా అభ్యర్థికి తన పూర్తి మద్దతు ప్రకటిస్తానని సుమిత్రా మహాజన్‌ ఇది వరకే స్ఫష్టం చేశారు. అందువల్ల భాజపా అనుకూల ఓట్లలో చీలక ఉండకపోవచ్చనే వాదనలు కూడా వినపడుతున్నాయి.